తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయవ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రోగ నిర్ధారణలో భాగంగా ఎక్స్‌రే పరీక్షలు కూడా చేపట్టారు.

క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అవసరమైన మందులు అందించడం వంటి చర్యలు ప్రజారోగ్య పరిరక్షణలో కీలకంగా నిలుస్తున్నాయి. ఈ తరహా వైద్య కార్యక్రమాల ద్వారా వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ షోయిల్, సూపర్‌వైజర్ రహీం, నరేష్, మధుబాబు, డీపీఎస్ శ్రీను, ఎస్‌ఎన్ జ్యోతి, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు తిరుపతమ్మ, లక్ష్మి, సరస్వతి, పద్మ, ఇంద్రజ, సత్తెమ్మతో పాటు గాజుల నరేష్ యాదవ్, పవన్ గుప్తా, శేఖర్, వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు.