• డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి

• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పద్మశాలి సంఘం విజ్ఞప్తి.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాజకీయ విభాగం చైర్మన్ గుంటి నగేష్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు పద్మశాలి సంఘం నాయకులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొని డా. పవిత్ర వాణికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

త్యాగాల కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలి: వల్లకటి రాజ్ కుమార్

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకటి రాజ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. మంత్రి పదవిని సైతం త్యజించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పదవులు స్వీకరించబోనని ప్రకటించిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. అలాంటి త్యాగధనుడి కుమార్తె డా. పవిత్ర వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

నిస్వార్థ ఉద్యమ నేత వారసురాలికి అవకాశం కల్పించాలి

విశిష్ట అతిథి, దళిత నాయకుడు జేబీ రాజు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని, పదవులతో పాటు ఆస్తులను సైతం కోల్పోయినా తెలంగాణ కోసం పోరాటం కొనసాగించారని గుర్తుచేశారు. అలాంటి నిస్వార్థ నాయకుడి కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సమంజసమని అభిప్రాయపడ్డారు.

ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు మాట్లాడుతూ, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో బాపూజీ ప్రజల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (హెచ్‌క్యూ) గంజి శ్రీనివాస్ నేత మాట్లాడుతూ, మహాత్మా గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితో బాపూజీ ప్రజా ఉద్యమాల్లో ముందుండి, వివిధ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.

గవర్నర్ కోటా అర్హతలను ప్రస్తావించిన నాయకులు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ అర్హతలపై పద్మశాలి నాయకుడు రఘునందన్ నేత మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగిన వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని వివరించారు. అర్హతలకు అనుగుణంగా డా. పవిత్ర వాణి అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

అఖిల భారత పద్మశాలి యువజన సంఘం మాజీ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్ మాట్లాడుతూ, డా. పవిత్ర వాణి ఉన్నత విద్యార్హతలు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సల్ ఫౌండేషన్, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా చేనేత కార్మికులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఆమె సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిరిగద లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ, డా. పవిత్ర వాణి వంటి సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తికి చట్టసభలో అవకాశం కల్పిస్తే పద్మశాలీలు, చేనేత కార్మికులు, బహుజన వర్గాల సమస్యలను బలంగా వినిపించగలరని అన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా పద్మ మాట్లాడుతూ, పద్మశాలి మహిళకు ఉన్నత చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించడం మహిళా సాధికారతకు ప్రోత్సాహకరంగా నిలుస్తుందని తెలిపారు.

బాపూజీ సేవలను స్మరించుకున్న నాయకులు

మెదక్ జిల్లా అధ్యక్షుడు మ్యాకల జయరాములు మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయ పరిణామాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్రను గుర్తుచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, బాపూజీ డాక్యుమెంటరీ నిర్మాత తిరందాసు యాదగిరి మాట్లాడుతూ, బాపూజీ జీవిత చరిత్రను ప్రదర్శించిన సమయంలో సమావేశంలో పాల్గొన్నవారు భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు.

అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి బొద్దున బాపూజీ మాట్లాడుతూ, 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ్ బాపూజీతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.

ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని ఏకగ్రీవ డిమాండ్

సమావేశం చివరలో పాల్గొన్న నాయకులందరూ డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి తగిన గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల వెంకటేష్, వనమాల శంకర్, గ్రేటర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు సంతోష్, షాద్‌నగర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోట జనార్దన్, బాస రాజేందర్, బీహెచ్‌ఈఎల్ పద్మశాలి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తుమ్మ చిరంజీవి, మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదశ్రీ, రాష్ట్ర మహిళా కార్యదర్శులు పులిపాటి సుకన్య, మచ్చ భాగ్యలక్ష్మి తదితర రాష్ట్ర కమిటీ నాయకులు, బాపూజీ అభిమానులు, వివిధ జిల్లాల పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy