• పద్మశాలీల ఐక్యత, సమాజ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

సంస్థాన్ నారాయణపురం: హైదరాబాద్‌లోని ఆటోనగర్‌ హరిణి వనస్థలి పార్కులో నవంబర్‌ 1, 2026 (ఆదివారం) నిర్వహించనున్న 24వ పద్మశాలి దసరా మేళాకు సంబంధించి సంస్థాన్ నారాయణపురంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. దసరా మేళా వైస్‌ చైర్మన్‌ జెల్లా సూర్యకాంత్‌ నేత, కార్యదర్శి చెరుపల్లి ప్రభాకర్‌ నేత ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి సంఘాలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను అందించారు.

ఈ సందర్భంగా చేనేత పద్మశాలి కుల సంఘం, శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం, చేనేత సహకార సంఘం, పద్మశాలి యువజన సంఘం, చేనేత కార్మిక సంఘం, ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ నిర్మాణ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను మేళాకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పద్మశాలి సమాజ సర్వతోముఖాభివృద్ధి, కులబాంధవుల మధ్య ఐక్యతను పెంపొందించడం, సంఘటిత శక్తిని చాటడమే లక్ష్యంగా 24వ పద్మశాలి దసరా మేళాను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌ 1న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు.. ఉచిత వైద్య శిబిరాలు

దసరా మేళాలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక క్రీడలు, ప్రముఖుల సందేశాలు, ప్రతిభావంతులకు సన్మానాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు, వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హరిణి వనస్థలి పార్కులో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులబాంధవులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరై మేళాను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ వేడుకల ద్వారా పద్మశాలి సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం 4వ వార్డు సభ్యుడు సూరపెల్లి వెంకటేశం, 3వ వార్డు సభ్యుడు సింగం బిక్షపతి, పద్మశాలి కుల సంఘం ప్రధాన కార్యదర్శి వంగరి రఘు, రిపోర్టర్‌ సింగం కృష్ణ, విడం సాయి కిషోర్‌, శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షుడు సూరపెల్లి కుచేల్‌, చేనేత సహకార సంఘం కార్యదర్శి దోర్నాల అంజయ్య, కోశాధికారి సంగిశెట్టి అనంత, మేకని యాదగిరి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు సంగిశెట్టి ధనుంజయ, గంజి రాజేష్‌, సంఘం మేనేజర్‌ మేడం వెంకటేశం, ప్రొడక్షన్‌ ఇన్‌చార్జి గుర్రం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy