• ఎమ్మెల్యే నాగరాజు కృషితో నియోజకవర్గ అభివృద్ధిలో వేగం
• ఎంపీ నిధులతో ఇప్పటికే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు
• ప్రతి ఏడాది వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.50-60 లక్షల నిధులు కేటాయింపు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో సమస్యలకు వేగవంతమైన పరిష్కారం: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

న్యూస్ డెస్క్ : వర్ధన్నపేటలో రూ.46 లక్షల 90 వేల వ్యయంతో ఆకేరు వాగుపై చెక్ డ్యాం శాశ్వత మరమ్మత్తు పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఏర్పాటు చేసిన రైతు వారము కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు.

తాను గతంలో వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, వర్షాలు పడినప్పుడల్లా రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఆ సమస్యను ఎన్నిసార్లు చూసినా గత ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు చొరవతో చెక్ డ్యాం శాశ్వత మరమ్మత్తు పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

“కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం” అని పేర్కొన్న ఎంపీ, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకే ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే తన ఎంపీ నిధుల నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు చేశానని వెల్లడించారు. ప్రతి ఏడాది రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. “ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను” అని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ద్వారా 90 రోజుల వ్యవధిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేసి, పెండింగ్ సమస్యలకు వేగంగా పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, వైస్ చైర్మన్ శోభారాణి, ఇరిగేషన్ ఎస్‌ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్ కుమార్, డీఈ రాజు, ఏఈ అమర్నాథ్, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, టెంపుల్ చైర్మన్ ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.