• జనగణనలో ప్రత్యేక బీసీ కాలమ్ చేర్చాలి

• కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్

హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనకు బీసీ కులగణన అత్యంత కీలకమని, 2027 జనగణనలో బీసీ కులాలను ప్రత్యేకంగా గుర్తించే విధంగా ప్రత్యేక బీసీ/ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, బీసీల జనాభాను ఏ విధంగా గుర్తించి నమోదు చేస్తుందనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనం వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2025 ఏప్రిల్ 30న కేంద్ర ప్రభుత్వం రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదేనని, అయితే కులగణన ప్రకటనతోనే బీసీలకు న్యాయం జరిగినట్లు కాదన్నారు. దేశంలోని బీసీల వాస్తవ జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఉపకులాల వారీగా వారి సంఖ్యను కచ్చితంగా గుర్తించే శాస్త్రీయ విధానం ఉండాలని స్పష్టం చేశారు.

జనగణన రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 14న ప్రకటించిన 40 ప్రశ్నల ప్రశ్నావళిలో కులానికి సంబంధించిన పదో ప్రశ్నపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని గుజ్జ సత్యం పేర్కొన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కులం అనే విభాగాలున్నప్పటికీ బీసీ/ఓబీసీలను ప్రత్యేకంగా గుర్తించే స్పష్టమైన కాలమ్ లేకపోవడం ఆందోళనకరమన్నారు. బీసీలను ఇతర కులాల విభాగంలో నమోదు చేస్తే దేశవ్యాప్తంగా బీసీల మొత్తం జనాభాను ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. బీసీ కులాల వివరాలు కేవలం పేర్ల రూపంలో నమోదు చేయడం కాకుండా, రాష్ట్రాలవారీగా అధికారిక బీసీ జాబితాలతో అనుసంధానించి, ప్రతి కులానికి ప్రత్యేక జాతీయ కుల కోడ్ (యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్) కేటాయించాలని సూచించారు. అలా చేసినప్పుడే దేశవ్యాప్తంగా బీసీల జనాభాను కచ్చితంగా లెక్కించడంతోపాటు ఉపకులాల వారీగా గణాంకాలను విశ్లేషించే అవకాశం ఉంటుందన్నారు.

2011లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్‌ఈసీసీ)లో చోటుచేసుకున్న లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అప్పట్లో కులాల పేర్లలో వ్యత్యాసాలు, ఉపకులాలు, ఇంటిపేర్లు, ప్రాంతీయ పేర్ల కారణంగా సమాచారాన్ని శాస్త్రీయంగా వర్గీకరించడంలో సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు. ఫలితంగా సేకరించిన కులగణన సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోయారని విమర్శించారు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే రాష్ట్రాలవారీగా కులాల జాబితాలను సిద్ధం చేసి, గణన సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. బీసీల జనాభా లెక్కలు విశ్వసనీయంగా నమోదుకాకపోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు.

బీసీ కులగణన, ప్రత్యేక బీసీ కాలమ్ అంశంపై తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని గుజ్జ సత్యం కోరారు. జనగణనలో బీసీలను ప్రత్యేకంగా గుర్తించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి బలాన్నిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల, సామాజిక, ఆర్థిక సర్వే అనుభవాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒక రాష్ట్ర శాసనసభ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, దేశంలోని కోట్లాది బీసీల హక్కులకు సంబంధించిన అంశంగా పరిగణించాలని అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్రాల సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి జనగణన విధానంలో అవసరమైన మార్పులు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

బీసీ కులాల వివరాల నమోదు, కులాల జాబితా, డ్రాప్‌డౌన్ విధానం తదితర అంశాలపై సుప్రీంకోర్టులో జరిగిన న్యాయపరమైన పరిణామాలను కూడా కేంద్ర ప్రభుత్వం గంభీరంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం విధానపరమైన నిర్ణయాలకు సంబంధించినదైనందున సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కారం కోరే అవకాశం ఉందని కోర్టు సూచించిన నేపథ్యంలో కేంద్రం బాధ్యత మరింత పెరిగిందన్నారు. న్యాయస్థానంలో వచ్చిన పరిణామాలను బీసీ కాలమ్ అవసరం లేదనే అభిప్రాయానికి ఆధారంగా చూపడం సరికాదని, కులగణనలో బీసీలను గుర్తించే పద్ధతిపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కులగణనకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ఇప్పుడు అసలు పరీక్ష దాని అమలులోనే ఉందని గుజ్జ సత్యం అన్నారు. బీసీలను గుర్తించేందుకు ప్రత్యేక కాలమ్ ఎందుకు చేర్చడం లేదని, రాష్ట్రాలవారీగా అధికారిక బీసీ జాబితాలను ప్రామాణికంగా తీసుకుంటారా? ప్రతి కులానికి ప్రత్యేక జాతీయ కోడ్ కేటాయిస్తారా? ఉపకులాల వారీగా జనాభా వివరాలను నమోదు చేస్తారా? సేకరించిన గణాంకాలను బహిరంగపరుస్తారా? వాటి ఆధారంగా భవిష్యత్తు సంక్షేమ విధానాలు రూపొందిస్తారా? అనే అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కులగణన గణాంకాలు అందుబాటులో ఉంటేనే బీసీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు.

దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో అధికారికంగా లెక్కించకుండా వారికి జనాభా ప్రాతిపదికన న్యాయం చేస్తామనడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ కులగణన అనేది ఏ ఒక్క కులానికి వ్యతిరేకమైన అంశం కాదని, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం కూడా కాదని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సమాచార సేకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ముందుగా విశ్వసనీయమైన కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జనగణన ప్రశ్నావళిలో ప్రత్యేక బీసీ/ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని, రాష్ట్రాలవారీగా బీసీ కులాల అధికారిక జాబితాలను సమన్వయం చేసి ప్రత్యేక కుల కోడ్ల విధానాన్ని అమలు చేయాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సంబంధిత ఉన్నతాధికారులకు బీసీ సంఘాల తరఫున వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. కేంద్రం స్పందించకపోతే దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కులగణన అనేది కేవలం జనాభా లెక్కింపు ప్రక్రియ కాదని, కోట్లాది బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన పునాది అని పేర్కొన్నారు. బీసీలను కచ్చితంగా లెక్కించకుండా వారికి సామాజిక న్యాయం కల్పించడం సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో సామాజిక న్యాయాన్ని నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Avatar photo

By Murthy