తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్  : మైలార్ దేవ్‌పల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే బీభత్సం సృష్టించి ప్లాస్టిక్ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాంను పూర్తిగా దహనం చేశాయి. మంటల తీవ్రతకు రెండు పరిశ్రమలు అగ్నికి ఆహుతి కాగా, లక్షలాది రూపాయల విలువైన ఆస్తి బూడిదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై మైలార్ దేవ్‌పల్లి డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు యు. విజయకుమార్ తీవ్రంగా స్పందించారు.

పరిశ్రమల్లో భద్రతా చర్యలు నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమంజసం కాదని, యజమానులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని హితవు పలికారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత హడావుడి పడటం కంటే ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

ప్రతి పరిశ్రమలో తప్పనిసరిగా పనిచేసే అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను ఎప్పటికప్పుడు నిపుణులతో తనిఖీ చేయించాలని, ప్రమాదకర వస్తువుల నిల్వ విషయంలో నిబంధనలు పాటించాలని కోరారు. కార్మికుల ప్రాణాలకు, కోట్లాది రూపాయల ఆస్తులకు ముప్పు వాటిల్లకుండా యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు! :

అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన పరిశ్రమల యజమానులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజయకుమార్ డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని, బాధితులకు తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పరిశ్రమలు, గోదాముల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కే. రవి, పి. వెంకటేష్, అశోక్, సాగర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

You missed