తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ జాగీర్ పరిధిలోని పాందేన్‌వాగు నాలాలోకి వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని పాందేన్‌వాగు పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చట్టరీత్యా తప్పిదమని పేర్కొంటూ ప్రజావాణి కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసింది.
యాంబియన్స్ కోర్ట్‌యార్డ్ నుంచి పాందేన్‌వాగు నాలా వరకు ప్రతిపాదించిన పైప్‌లైన్‌ను వర్షపు నీటి కాలువగా పేర్కొంటూ వెడల్పాటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలనే మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమితి సభ్యులు తెలిపారు. ఈ పనుల అసలు ఉద్దేశం, రూపకల్పన, పర్యావరణంపై పడే ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోరారు.

గతంలో గోల్డెన్ టెంపుల్, లక్ష్మీనగర్ కాలనీ, అంజలి గార్డెన్స్, అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని రోడ్డు నంబర్ 30 ప్రాంతాల్లోనూ వర్షపు నీటి కాలువల పేరుతో భూగర్భ మురుగు నీటి పారుదలకు అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోకుండా ఇంజనీరింగ్ విభాగం మరో వివాదాస్పద ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పనులు తాత్కాలికంగా నిలిపివేయాలి :

ప్రతిపాదిత పైప్‌లైన్ పనుల అసలు ఉద్దేశం, రూపకల్పన, సాంకేతిక అనుమతులను స్వతంత్రంగా పరిశీలించి నిర్ధారించే వరకు పనులను నిలిపివేయాలని పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. అదే సమయంలో పంచవటి కాలనీ నుంచి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు చేపట్టాల్సిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను కొనసాగించాలని అధికారులను కోరింది. పాందేన్‌వాగు నాలా పరిరక్షణతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సమితి విజ్ఞప్తి చేసింది.

 

You missed