తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో దీపావళి పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. ఇళ్లు, వ్యాపార సముదాయాలు విద్యుత్ దీపాలు, పూల అలంకరణలతో కళకళలాడాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

పండుగ సందర్భంగా వ్యాపారస్తులు తమ దుకాణాలు, వ్యాపార సంస్థల్లో ప్రత్యేకంగా లక్ష్మీపూజలు నిర్వహించారు. వ్యాపారాభివృద్ధి, కుటుంబ సౌభాగ్యం, ఆర్థిక శ్రేయస్సు కలగాలని అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. పలు ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో మహిళలు సంప్రదాయబద్ధంగా లక్ష్మీపూజలు నిర్వహించారు.

ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు వెలిగించి భక్తిపారవశ్యంలో పండుగను జరుపుకున్నారు. పలువురు మహిళలు సంప్రదాయ దొంతులు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ ఆచారాలకు అనుగుణంగా నోములు, వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సాయంత్రం వేళ ఇళ్ల ముందు దీపాలు వెలిగించడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీలు దీపకాంతులతో వెలిగిపోయాయి. పిల్లలు, యువత టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకోగా, పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. దీపావళి పండుగ ప్రజల్లో ఆనందం, ఆధ్యాత్మిక భావనతో పాటు కుటుంబ బంధాలు, సోదరభావం, ఐకమత్యాన్ని మరింత పెంపొందించింది. చెడుపై మంచి సాధించిన విజ యానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ ఘనంగా నిర్వహించు కున్నారు. పండుగ వేడుకలతో నియోజకవర్గమంతా పండుగ శోభను సంతరించుకుంది.