తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన పండుగ సెలవులను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు సంవత్సరానికి 15 సాధారణ సెలవులు, 8 జాతీయ పండుగ సెలవులు అమలు చేస్తామని గత జూన్ 19న కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాలని కోరినట్లు వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమైన మున్సిపల్ కార్మికులకు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేతనాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లు, విద్యుత్ సిబ్బంది, వాటర్‌మెన్లు, ఇతర విభాగాల కార్మికులకు కూడా పెరిగిన వేతనాలు వర్తింపజేయాలని కోరినట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన విధంగానే అన్ని విభాగాల కార్మికులకు వేతనాలు పెంచి, గ్రేటర్ హైదరాబాద్ వేతనాలను అమలు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వనంపల్లి జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమతం యాదగిరి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

You missed