తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆధునిక భారతదేశ నిర్మాణంలో తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర కొనియాడదగినదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, ప్రతి ఒక్కరికీ విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన మహానేత నెహ్రూ అని కొనియాడారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లోని ప్రాథమిక పాఠశాలలో కేపీహెచ్‌బీ డివిజన్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, సమసమాజ స్థాపన జరగాలంటే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. కుల, మత, ఆర్థిక వివక్షలకు తావులేకుండా ప్రతి చిన్నారికి విద్య అందాలని నెహ్రూ ఆనాడే ఆకాంక్షించారని, విద్యారంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. చిన్నపిల్లలంటే నెహ్రూకి ఎంతో ప్రేమ, అభిమానం ఉండేవని, బాలల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా చిన్నారులు ఆయనను ప్రేమగా ‘చాచా నెహ్రూ’ అని పిలుచుకునేవారని పేర్కొన్నారు. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సైతం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక మార్పులు తీసుకొస్తున్నారని బండి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, శంకర్ గౌడ్, రంగమోహన్, సంధ్య, బాబ్జి కుమార్, నలినీకాంత్, బొచ్చు మళ్లీ, అపర్ణ, విజయలక్ష్మి, కళ్యాణ్, అబ్దుల్లా, నితీష్ తదితరులు పాల్గొన్నారు.