తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని సంస్కృతి హై స్కూల్లో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్, సంస్కృతి హై స్కూల్ ప్రిన్సిపాల్ పెండ్యాల కృష్ణ ప్రసాద్, కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపాల్ వి. సౌజన్య, యువ నాయకుడు కచ్చావా దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులని, నేటి బాలలే రేపటి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే పౌరులని అన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని చదువుకు కేటాయించాలని, ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడంతో పాటు తల్లిదండ్రుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉంటోందని, వాటికి బానిసలుగా మారకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే మొబైల్ ఫోన్లను వినియోగించాలని, విలువైన సమయాన్ని వృథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, మానవతా విలువలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అనంతరం, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి విద్యార్థులకు పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమాభిమానాలు ఉండేవని, ఆయనను పిల్లలు ప్రేమగా ‘చాచా నెహ్రూ’ అని పిలుచుకునేవారని తెలిపారు. పిల్లలతో సమయం గడపడం, వారి ఆనందాన్ని పంచుకోవడం ఆయనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. నవంబర్ 14న నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని, పిల్లల హక్కులు, వారి సంక్షేమం, విద్య, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధిపై సమాజంలో అవగాహన కల్పించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, మంచి వాతావరణం అందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని హమీద్ పటేల్ పిలుపునిచ్చారు. అపజయాలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని షేక్ హమీద్ పటేల్ ఈ సందర్బంగా ఆకాంక్షించారు.
