తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని 2.39ఎకరాల స్థలాన్ని స్థానిక ప్రజల కోరిక మేరకు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం పాఠశాల నిర్మాణం కోసం విద్యాశాఖకు కేటాయిస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సోమవారం కేపీహెచ్బీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి రమేష్ హాజరయ్యారు. అనంతరం, విద్యార్థులను ఉద్దేశించి బండి రమేష్ మాట్లాడుతూ, కేటాయించిన స్థలంలో వీలైనంత త్వరగా పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని, సొంత స్థలం ఉన్న అర్హులైన వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఈ సందర్భంగా తిప్పికొట్టారు. పాఠశాల నిర్మాణం కోసం స్థలం కేటాయించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, రాజేష్, శంకర్ గౌడ్, కొప్పిశెట్టి దినేష్ కుమార్, రంగమోహన్, బాబ్జి కుమార్, నితీష్, సంధ్య వాణి, సుజాత, సరోజ, అపర్ణ, జయలక్ష్మి, రాజేశ్వరి, బచ్చుమల్లి, రజిత, గోపాల్ చౌదరి, కల్పన, రజిని తదితరులు పాల్గొన్నారు.
