తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: ఉమ్మడి గచ్చిబౌలి డివిజన్, గుల్మోహార్ పార్క్ నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సహాయ సహకారాలతో వేద పండితులు శ్రీ రాఘవేంద్ర శాస్త్రి గారి సమక్షంలో శ్రీ సాయి బృందావన క్షేత్రం అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల జయ జయధ్వానాల నడుమ ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చైతన్యానికి, భక్తి భావనకు నిలయమైన ఆలయాల అభివృద్ధి మనందరి బాధ్యత అని తెలిపారు. శ్రీ సాయి బృందావన క్షేత్రం పునర్నిర్మాణం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక సేవలతో మరింత విస్తృతంగా అందుతాయని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి కోసం ఆధ్యాత్మిక దైవచింత సేవలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని తెలిపారు. భక్తులందరూ ఈ పుణ్య కార్యంలో భాగస్వాములై క్షేత్ర అభివృద్ధికి తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, నేతాజీనగర్ కాలనీ ప్రెసిడెంట్ భేరి రాంచందర్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బాపునగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీకాంత్ దేవులపల్లి, నర్సింహా, ఎంగయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, రాయుడు, గణేష్, జైరాజ్ సింగ్, రేణు, సాయి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
