తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, రాష్ట్ర కమిటీ సభ్యులు వర్కాల చంద్రశేఖర్, చేనేత కార్మికులు తిరందాస్ జయవర్ధన, రావిరాల తిరందాస్ ఈ బృందంలో ఉన్నారు.
సమన్వయ సమావేశానికి ఆదేశం:
చేనేత సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, వాటి పరిష్కారానికి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతినిధులు కోరారు. మంత్రి వెంటనే స్పందించి, కమిషనర్‌తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఓఎస్డీని ఆదేశించారు.
త్రిఫ్ట్ పథకం, చేనేత భరోసా నిధులు: త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికులు తమ వాటా డిపాజిట్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ వాటా గత 20 నెలలుగా జమ కాలేదని సంఘం నేతలు తెలిపారు. చేనేత భరోసా కూడా చెల్లించలేదని పేర్కొంటూ, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు.
దీనికి మంత్రి స్పందిస్తూ, చేనేత శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపామని, అక్కడి నుంచి నిధులు రాగానే త్రిఫ్ట్ పథకం, చేనేత భరోసా విడుదల చేస్తామని చెప్పారు. బడ్జెట్ విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక మంత్రికి మరోసారి రిమైండర్ లేఖ రాయాలని ఓఎస్డీని ఆదేశించారు. సంఘం ప్రతినిధులు కూడా ఆర్థిక మంత్రిని కలిసి ఈ విషయంలో ఒత్తిడి తేవాలని సూచించారు.
మంత్రి సూచన మేరకు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేసి, చేనేత నిధులు విడుదల చేయాలని కోరతామని సంఘం నేతలు మంత్రికి తెలిపారు.
