చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్కు వ్యాపార వర్గాలతో కలిసి వినతిపత్రం అందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్:
జమ్మికుంట పట్టణంలో రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రామగుండం చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్కు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రముఖ వ్యాపార వర్గాల ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని తెలిపారు. నాలుగు జిల్లాలకు చెందిన వందలాది గ్రామాలకు జమ్మికుంట కూడలిగా ఉందని, ఇక్కడి వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, ఆయిల్ మిల్లులు, సీడ్ ప్లాంట్లు, గ్రానైట్ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వివరించారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాలతో పాటు వరంగల్ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, పరకాల మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్, ఓదెల మండలాల పరిధిలోని గ్రామాల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులైన ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను జమ్మికుంట సెలక్షన్ గ్రేడ్ వ్యవసాయ మార్కెట్ ద్వారా విక్రయిస్తారని తెలిపారు.
అదేవిధంగా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా జమ్మికుంట కేంద్రంగానే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఇక్కడ భారీ గిడ్డంగులను నిర్మించిందని, సివిల్ సప్లై కార్పొరేషన్ గోదాంలతో పాటు ప్రైవేటు గోదాంలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
అయితే జమ్మికుంటలో రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్ లేకపోవడంతో సరుకుల రవాణా వ్యయం పెరిగి వ్యాపార వర్గాలపై భారం పడుతోందని తెలిపారు. ఇక్కడ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా సులభతరమై, ఈ ప్రాంతం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాబట్టి జమ్మికుంటలో రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ ప్రతినిధి బచ్చు భాస్కర్, జమ్మికుంట పట్టణ వ్యాపార వర్గాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
