హైదరాబాద్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిస్తున్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్న విధంగానే, చేనేత కార్మికులు నేస్తున్న అన్ని వస్త్రాలను కూడా టెస్కో (TESCO) ద్వారా కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తం మురళి డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి Tummala Nageswara Raoను కమర్తం మురళి నాయకత్వంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు, జిల్లా అధ్యక్షులు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి లేక ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించేలా ప్రత్యేక జీవో విడుదల చేయాలని కోరారు.

చేనేత కార్మికులు నేసే వస్త్రాలను టెస్కో ద్వారా నేరుగా కొనుగోలు చేయడం వల్ల వారికి చేతినిండా పని లభించడంతో పాటు ఆర్థిక భద్రత కూడా కలుగుతుందని ప్రతినిధులు మంత్రికి వివరించారు.

వారి వినతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు Kandagatla Swami, సెక్రటరీ జనరల్ Gaddam Jagannatham, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, యువజన విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొప్పెరి వెంకట హరిహర కిషన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం, టీపీపీఎస్ ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, గుర్రం శ్రవణ్, వైద్యం రాజగోపాల్, ఆడెపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.