పాత విధానంలోనే పథకం కొనసాగించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయొద్దు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, అది సమస్య పరిష్కారానికి తొలి అడుగు మాత్రమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, వందలాది ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, లక్షలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా కల్పించే సామాజిక న్యాయ పథకమని పేర్కొన్నారు. బకాయిల విడుదలలో జరుగుతున్న జాప్యం కారణంగా విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు పొందలేకపోవడం, తదుపరి విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల అడ్మిషన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అనేక కళాశాలలు ముందస్తుగా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరం నుంచి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో, పాత బకాయిలను పూర్తిగా చెల్లించకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తే సమస్యలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. విద్యార్థులు ముందుగా ఫీజులు చెల్లించి తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం వేచి చూడాల్సి వస్తే వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.

ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరణ కోరడం సమస్య తీవ్రతకు నిదర్శనమని గుజ్జ సత్యం పేర్కొన్నారు. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నిర్దిష్ట కాలపట్టిక ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా వేగంగా విడుదల చేయాలని కోరారు.

అంతేకాకుండా ప్రతి విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధిని ఏర్పాటు చేసి, నెలవారీగా నిధులు విడుదల చేసే శాశ్వత విధానాన్ని అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు, కళాశాలలు ప్రతిసారీ నిధుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి శాశ్వత ముగింపు పలకాలని అన్నారు.

ప్రభుత్వానికి గుజ్జ సత్యం సూచనలు

* విడుదల చేసిన రూ.100 కోట్లతో పాటు మిగిలిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ అత్యవసరంగా విడుదల చేయాలి.
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత విధానంలోనే కొనసాగించాలి.
* కొత్త విద్యా సంవత్సరం అడ్మిషన్లలో విద్యార్థుల నుంచి ముందస్తు ఫీజులు వసూలు చేయకుండా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలి.
* ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని విడుదల చేస్తూ శాశ్వత చెల్లింపు విధానాన్ని అమలు చేయాలి.
* కళాశాలలకు బకాయిల విడుదలకు కాలపట్టిక ప్రకటించి, విద్యార్థుల సర్టిఫికెట్ల జారీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

విద్య హక్కు ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని గుజ్జ సత్యం కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy