“నిండు ప్రాణానికి రెండు చుక్కలు” నినాదంతో చిన్నారులకు పోలియో చుక్కలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 25 మండలాల పరిధిలోని 535 గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ “నిండు ప్రాణానికి రెండు చుక్కలు” అనే నినాదంతో ప్రతి 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిన్న వయస్సులోనే పోలియో వైరస్ బారిన పడకుండా పిల్లలను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, తమ పరిసరాల్లోని ఐదేళ్లలోపు చిన్నారులందరినీ సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, ప్రతి చిన్నారి ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య అధికారులు పిలుపునిచ్చారు.