• విచారణ అధికారులే అవినీతి పరులైతే అటవీకి దిక్కెవరు
• కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో పత్రిక విలేకరుల సమావేశంలోని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవిని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీ శాఖ జిల్లా అధికారి, సబ్ డివిజన్ అధికారుల క్రింది స్థాయి ఉద్యోగుల ప్రమేయంతో అడివి తల్లి ఎడారులుగా మారి కాసుల వర్షం కురిపిస్తుందని. ఈ అధికారులపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్, రాష్ట్ర స్థాయి అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా విచారణ జరిపించి శాఖపరమైన చర్య తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారుల ప్రమేయంతో అటవీ పై పోడు భూమి విధ్వంసం జరుగుతుందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని, విచారణ అధికారులే అవినీతికి పాల్పడితే అడవికి దిక్కేవరని పీకా కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ భూముల విక్రయాలు, అన్యాక్రాంతం దందా యథేచ్ఛగా సాగుతోంది. ఫారెస్ట్ అధికారులు, స్థానిక బ్రోకర్లు కుమ్మక్కై ఇతర దూర ప్రాంతాలకు చెందిన లీడర్లకు ఇక్కడి అటవీ భూములను, ముఖ్యంగా నిరుపేద గిరిజన జాతికి చెందిన వారు సాగు చేసుకుంటున్న పోడు భూములను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని, డి,ఆఫ్,ఓ స్థాయి నుండి స్ట్రైకింగ్ ఫోర్స్ వరకు వీరి యొక్క ఫోన్ ట్రాపింగ్ చేస్తే అసలు రహస్యం బలవుతుందని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇతర దూరప్రాంతాలకు చెందిన ఫారెస్ట్ అధికారులకు, బ్రోకర్లకు భారీగా డబ్బులు ఆశజూపి అటవీ భూములను చేజిక్కించుకుంటున్నారు. ఎస్టీ వాళ్ళు ఎంతో కష్టపడి కొట్టుకున్న పోడు భూములను, ఇక్కడి బ్రోకర్లు, ఫారెస్ట్ అధికారులు రకరకాల మాయమాటలు చెప్పి బెదిరిస్తూ, వారిని మోసం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులే స్వయంగా దగ్గరుండి మరీ ఆ పోడు భూములను ఇతర ప్రాంతాల లీడర్లకు అక్రమంగా విక్రయిస్తూ గిరిజనుల పొట్టగొడుతున్నారని పీక కిరణ్ ఆరోపించారు.
ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమవుతున్నాయి. జూన్ 10వ తేదీన ప్రచురితమైన పత్రికా క్లిప్పింగ్ కథనం ప్రకారం… మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం వద్ద అటవీ భూములను ఎకరానికి కొంత రేటు నిర్ణయించి విక్రయించిన ఇద్దరు బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ నాయకులు అజ్మీర పుల్ సింగ్, పీక కిరణ్, లవుడియా తిరుపతి, దేవేందర్, జగన్ తదితరులు అప్పట్లో సీసీఎఫ్ కు స్వయంగా ఫిర్యాదు చేశారు. నిమ్మగూడెం, రెడ్డిపల్లి బీట్ అధికారులు శ్రీకాంత్, అఖిల్ రెడ్డి నిమ్మగూడెంలో గత రెండేళ్ల కాలంలో దాదాపు 400 ఎకరాల అటవీ భూములను విక్రయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదేవిధంగా, జూన్ 24వ తేదీన ప్రచురితమైన పత్రికా క్లిప్పింగ్ కథనం ప్రకారం మల్హర్ మండలంలోని కొయ్యూర్ రేంజర్ పరిధిలో అటవీ భూమి అక్రమ సాగుకు సహకరించడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను ఒక సెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్, బీట్ ఆఫీసర్ సాయికృష్ణలపై డిఎఫ్ఓ నవీన్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు.
అడవుల నరికివేతతో పర్యావరణ వినాశనం: మూగజీవాలకు ముప్పు, తగ్గుతున్న వర్షాలు!
స్వార్థ ప్రయోజనాల కోసం, డివిజన్ పరిధిలో జరుగుతున్న ఈ అటవీ భూముల దందా కేవలం గిరిజనులకు మాత్రమే కాదు, మొత్తం పర్యావరణానికే తీరని చేటు తెస్తోంది. కాసుల కక్కుర్తితో అడవులను విచ్చలవిడిగా నరికేస్తుండటం వల్ల వన్యప్రాణులు, మూగజీవాలు తమ సహజసిద్ధమైన ఆవాసాలను కోల్పోతున్నాయి. ఫలితంగా డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అంతేకాకుండా, దట్టమైన అడవులు అంతరించిపోతుండటంతో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడి ఏటా వర్షపాతం పడిపోతోంది. కరవు పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికైనా అడవుల నరికివేతను ఆపకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని మండలాలలో ఫారెస్ట్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడినప్పటికీ, ఈ భూముల దందా మాత్రం ఆగడం లేదని పీక కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చిన్నపాటి చర్యలతో సరిపెట్టకుండా, అవినీతికి పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారుల యొక్క కాల్ రికార్డ్స్ అదేవిధంగా వారి బ్యాంక్, ఫోన్ పే హిస్టరీ ని క్షుణ్ణంగా చెక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ఎవరెవరికి ఎంతెంత చేతులు మారాయో అసలు నిజాలు బయటపడతాయన్నారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నతాధికారులు లోతుగా దృష్టి సారించాలని, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులను, బ్రోకర్లను, దూరప్రాంత లీడర్లను కఠినంగా శిక్షించాలని, గిరిజనుల పోడు భూములకు, అడవులకు రక్షణ కల్పించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు.జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్,జిల్లా కో ఆర్డినేటర్ రామగిరి రాజు పాల్గొన్నారు.