• బీసీ మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ: గుజ్జ సత్యం

హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్, బీసీ–యాదవ సామాజికవర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్‌బీ నగర్ చౌరస్తాలో బీసీ, యాదవ మరియు పలు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘీభావం తెలియజేయడానికి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.

“ఒక బీసీ మహిళపై అవమానకర వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదు, రాష్ట్రంలోని కోట్లాది బీసీ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ మాటల్లో బాధ్యత, సంయమనం పాటించాలి. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆదర్శంగా నిలవాలి కానీ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు” అని గుజ్జ సత్యం పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సమాన గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం నిరంతరం పోరాటాలు జరుగుతున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో తప్పు సంకేతాలు పంపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళల గౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం గురించి రాజకీయ పార్టీలు తరచూ మాట్లాడుతున్న నేపథ్యంలో తమ నాయకుల ప్రవర్తన కూడా అదే విలువలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.

ఈ ఘటనపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, బాధ్యతాయుతమైన వైఖరి ప్రదర్శించాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించి, పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశంపై వెంటనే స్పందించి పార్టీ ప్రతిష్ఠను కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించి బీసీ మహిళల గౌరవానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బీసీలు, యాదవులు సహా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులకు నైతిక ప్రమాణాలు, బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతి గురించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన సూచించారు.

డిమాండ్లను ప్రభుత్వం, సంబంధిత పార్టీలు పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, యాదవ సంఘాలతో కలిసి దశలవారీగా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, ధర్నాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని గుజ్జ సత్యం హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, యాదవ సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఈశ్వరమ్మ యాదవ్‌కు సంఘీభావం ప్రకటించారు.