తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరంతరం ప్రశ్నిస్తున్న నాయకుడిపై ఈ చర్య తీసుకోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే గొంతుకలను భయపెట్టే ప్రయత్నంగా భద్రత తగ్గింపును చూస్తున్నామని ఆయన అన్నారు. ప్రజా నాయకుల భద్రతతో రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు గతంలో ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, భద్రతను వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో గన్‌మెన్ల భద్రతను కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్యను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డా. కురువ విజయ్ కుమార్ తెలిపారు.