తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ డివిజన్, గోకుల్ ప్లాట్స్ డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ ‘గుండె’ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని చందానగర్ లోని ఓమెగా పీఆర్ కే. హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘కార్డియాలజిస్ట్’ డాక్టర్ భానుకిరణ్ రెడ్డి, హాజరైనారు. ఈ సందర్భంగా డాక్టర్ భానుకిరణ్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణంలో వచ్చే పెను మార్పులతో, మారిన జీవనశైలితో మానవుడు గుండె జబ్బులతో సతమవుతున్నాడని గుండె జబ్బులు రోజురోజుకు అధికమవుతున్నాయని దీనితో ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయని నష్ట నివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు సంయుక్తంగా 2011వ సంవత్సరం సెప్టెంబర్ 29 నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఈ సంవత్సరం నినాదం ‘డోంట్ మిస్ ఎ బీట్ ‘ అని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, గుండెజబ్బుల వలన జరిగే అనర్థాలను, వ్యాధి లక్షణాలను, నివారణపై అవగాహన కల్పించడమే అని అన్నారు. పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవమని ఇది శరీరంలో ఛాతి, ఊపిరితిత్తుల మధ్య వుంటుంది. గుండె ఆక్సిజన్ పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది అని అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వలన వయసు, లింగభేదము లేకుండ ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. గుండెలోని రక్త నాళాలలోని బ్లాకుల ‘పూడికలు’ వలన రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడి రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోతుందని దీని ఫలితంగా ‘హార్ట్ ఎటాక్’ గుండె పోటు వస్తుందని వ్యాధి రావడానికి గల కారణాలు. మధుమేహము, బీపీ, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, వత్తిడి ఎక్కువగా ఉండటం, ధూమపానం, మద్యపానము సేవించడం, అధిక కొవ్వు కలిగిన పదార్థాలతో పాటు, మైదాతో తయారుచేసిన పదార్థాలు తీసుకోవడం వలన గుండెపోటు వస్తుందని అన్నారు. వ్యాధి లక్షణాలు ఛాతిలో ఆకస్మికముగా నొప్పి రావడం, అది మెడ వరకు ప్రాకడం, ఆకస్మిక మైకం, వికారం, శరీరమంతా చెమటలు పట్టి చల్లగా అయిపోయి ఇబ్బంది పడటం, ఛాతిలో నొప్పి ప్రారంభమయి ఎడమ చేయి, ఎడమ దవడ, కుడి చేయివరకు యీ నొప్పి వ్యాపిస్తుందని గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుందని తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంటుందని నివారణ చర్యలు మధుమేహం, కొలెస్ట్రాల్ ను నియంత్రణలో పెట్టుకోవాలని ధూమపానం మానేయాలని శారీరక శ్రమ, వ్యాయామం, ధ్యానం, ప్రాణయామం, నడక వంటివి కనీసం 30 నిమిషాల పాటు చేయాలని ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, క్యాలరీలు అధికంగా వున్న ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలని అలాగే రెడ్ మీట్ ను కూడా పూర్తిగా మానేయాలని వంట నూనెలు తక్కువగా వాడాలని తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మొలకలు, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు వాడాలని ప్రతిరోజు కనీసం 6నుండి 7గంటలు గాఢ నిద్ర పోవాలని ఈ విధమైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అలాగే 2డి ఎకో పరీక్షలు కూడా చేయించుకోవాలని తెలిపారు. గుండెపోటు వచ్చినపుడు ఆస్పరిన్ ట్యాబ్లెట్ ను చప్పరించాలని అవకాశం ఉన్న అన్ని సందర్భాలలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలలో పాల్గొని వ్యాధుల పట్ల అవగాహన పెంచుకొని వైద్యుల సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా బిపీ, షుగర్, 2డీ ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నిర్వాహకురాలు చావ అరుణ, సిబ్బంది, మహిళలు, కాలనీ వాసులతో పాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామిరెడ్డి, బాలాజీ అలాగే హాస్పిటల్ ప్రతినిధులు జాకీర్ హుసేన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.