తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌వీ కట్టెడాన్ డివిజన్ నాయకులు యాదగిరి భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు కూడా ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం నూతనంగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ​పట్టభద్రులు తమ విద్యా అర్హత ధ్రువపత్రాలతో సిద్ధమై, ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, ఈ నమోదు ప్రక్రియపై అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించేందుకు బీఆర్‌ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చొరవ చూపాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా మారి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని యాదగిరి భాస్కర్ ఆకాంక్షించారు.