తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏడు శాశ్వత ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ మైలార్దేవ్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన పల్లె దవాఖాన వైద్యాధికారుల ప్రతినిధి బృందం ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.
బుడ్వేల్, ఇందిరానగర్, హసన్‌నగర్, ఎంఎం పహాడీ, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్దేవ్‌పల్లి ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని వైద్యాధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు సమగ్ర ప్రాథమిక వైద్య సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. వినతిపై ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన ప్రభుత్వ భూమిని గుర్తించి కేటాయించేలా రెవెన్యూ అధికారులకు వెంటనే ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.