తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మార్కండేయ నగర్‌లోని ఆలయం సమీపంలో రోడ్డుపక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి స్థానిక ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకులు లాలిప్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో దుర్వాసన వ్యాపించి, దోమల బెడద పెరిగి పరిసర ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్ర వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన ఆలయం సమీపంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా క్షీణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిహెచ్‌ఎమ్‌సి శానిటేషన్ అధికారులు వెంటనే స్పందించి, పేరుకు పోయిన చెత్తను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలని లాలిప్ యాదవ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే అక్కడ మళ్లీ చెత్త వేయకుండా అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు.
