తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాలమాకుల ఇనామ్‌షేర్‌లో టీమ్‌ ఛత్రపతి శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుడి నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. 15 రోజులపాటు ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవరాత్రి ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో కోడి ప్రవీణ్‌ ఉత్సాహంగా పాల్గొని రూ.32,501లకు గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు.

వేలం పాటలో భక్తులు పోటాపోటీగా పాల్గొనడంతో సందడి నెలకొంది. లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రవీణ్‌ తెలిపారు. అనంతరం నిర్వాహకులు ప్రవీణ్‌ను శాలువా, పూలమాలతో సత్కరించి లడ్డూను అందజేశారు. యువత ఐకమత్యంతో ఉత్సవాలను విజయ వంతంగా నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. చివరగా ప్రత్యేక పూజల అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువత, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భక్తిగీతాలు, డీజే సందడి మధ్య నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది