తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ :  రంగారెడ్డి జిల్లా పేరును మార్చి జ్యోతిరావు పూలే–అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షుడు, పూలే–అంబేడ్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్ చిలకమర్రి నరసింహ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. హైదరాబాద్ జిల్లా నుంచి 1978లో విడదీసి రంగారెడ్డి జిల్లాగా పేరు మార్చారని, ప్రస్తుతం జిల్లాలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తున్నందున వారి ఆత్మగౌరవాన్ని ప్రతి బింబించేలా జిల్లాకు జ్యోతిరావు పూలే–అంబేడ్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో భూ పంపిణీ, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై బహుజన వర్గాలు వెనుకబాటుకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ముస్లిం కుటుంబాలకు సంబంధించిన భూ వివాదాలు దశాబ్దాలుగా పరిష్కారం కాకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఆత్మగౌరవంతో జీవించాలంటే బహుజన వర్గాలు రాజకీయంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్న నరసింహ, రంగారెడ్డి జిల్లా పేరును జ్యోతిరావు పూలే–అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఈ డిమాండ్ సాధన కోసం బహుజనులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.