తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చే లక్ష్యంతో హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో శివరాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 200 మంది పేదవిద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు. చదువే జీవితాన్ని మార్చే శక్తి.. ప్రతి విద్యార్థి పెద్ద కలలు కనాలి, వాటిని నిజం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలి అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా తమ వంతు సామాజిక బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.