తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  సురక్షితమైన, సక్రమంగా నిర్మించబడిన, ఆక్రమణలులేని కాలిబాటలపై నడిచే హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ది సిటిజన్స్ కౌన్సిల్ (ఫర్ ఎ బెట్టర్ సొసైటీ) స్వాగతించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19(1)(డి ), 21 ప్రకారం పాదచారుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొంది. రోడ్లు కేవలం వాహనాల కోసమే కాకుండా పాదచారులకు కూడా సమానంగా చెందుతాయని, కాలిబాటలపై పాదచారులకే ప్రాధాన్యత కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలిపారు. సురక్షితమైన, నిరంతరాయమైన కాలిబాటల నిర్మాణం, నిర్వహణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కాలిబాటల అభివృద్ధి, పునరుద్ధరణ, నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అక్రమ ఆక్రమణలు, అనధికార పార్కింగ్‌ను తొలగించి పాదచారులకు సౌకర్యవంతమైన మార్గాలను అందుబాటులోకి తేవాలని కౌన్సిల్ డిమాండ్ చేసింది. స్ట్రీట్ వెండర్స్ చట్టం–2014ను పూర్తిస్థాయిలో అమలు చేసి, టౌన్ వెండింగ్ కమిటీల ఏర్పాటు, వెండింగ్ జోన్లు, నో-వెండింగ్ జోన్లను శాస్త్రీయంగా గుర్తించాలని సూచించింది. అలాగే కొత్త రహదారులు, రోడ్డు విస్తరణలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో నాణ్యమైన కాలిబాటల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కాలిబాటలపై సమగ్ర సర్వే నిర్వహించి లోపాలను సరిదిద్దాలని కోరింది. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు అనుకూలంగా కాలిబాటలను అభివృద్ధి చేయడంతో పాటు నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై బాధ్యతను నిర్ధారించాలని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు అన్ని పట్టణ స్థానిక సంస్థలు సుప్రీంకోర్టు తీర్పు, స్ట్రీట్ వెండర్స్ చట్టం–2014ను సమన్వయంతో అమలు చేయాలని కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. పాదచారుల హక్కులు, వీధి వ్యాపారుల జీవనోపాధి హక్కులను సమతుల్యంగా పరిరక్షిస్తూ సురక్షితమైన, సమగ్ర పట్టణాల నిర్మాణానికి ఈ చారిత్రాత్మక తీర్పును అక్షరాలా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.