తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రముఖ సినీ నటుడు, విలక్షణ ప్రతినాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్, హిందీ టెలివిజన్ రంగంలో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు బి.ఆర్. చోప్రా నిర్మించిన ‘మహాభారత్’ ధారావాహికలో అశ్వత్థామ పాత్ర పోషించి నటుడిగా విశేష గుర్తింపు పొందారు. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో ‘సర్ఫరోష్’, ‘లగాన్’, ‘గజిని’ వంటి విజయవంతమైన చిత్రాల్లో తన అద్భుత నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. ముఖ్యంగా ‘గజిని’ చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ‘సై’ సినిమాతో ప్రవేశించిన ప్రదీప్ రావత్, బిక్షూ యాదవ్ పాత్రలో అసాధారణ నటన కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ పాత్రకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అనంతరం ‘ఛత్రపతి’ చిత్రంలో రాజ్ బిహారి పాత్రలో తన విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే భద్ర, దేశముదురు, స్టాలిన్, ఓయ్, నేను శైలజ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తెలుగులో ఆయన చివరిగా ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ చిత్రాల్లోనూ నటించి బహుభాషా నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించారు.
ప్రదీప్ రావత్ మృతితో భారతీయ సినీ పరిశ్రమ ఒక ప్రతిభావంతమైన నటుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
