తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, చేనేత రంగంలో రాజకీయ చైతన్యం పెంపొందించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న రాంపెల్లి లింగమూర్తిని తెలంగాణ చేనేత చైతన్య సభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

కరీంనగర్‌లోని పద్మశాలి ఏసీ కళ్యాణ మండపంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత చైతన్య మహాసభ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. చేనేత కార్మికులు, సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత రంగ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చేనేత కార్మికుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కులు, సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, సహకార సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రాంపెల్లి లింగమూర్తి చేస్తున్న కృషిని చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్, సభ ప్రతినిధులు అభినందించారు.
రాష్ట్ర మీడియా కార్యదర్శిగా, నేతన్న టీవీ చీఫ్ ఎడిటర్‌గా చేనేత కార్మికుల సమస్యలకు మీడియా వేదికగా బలమైన స్వరం అందిస్తూ, వారి సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. చేనేత రంగానికి సంబంధించిన కార్యక్రమాలు, కార్మికుల సమస్యలు, హక్కుల సాధన ఉద్యమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాంపెల్లి లింగమూర్తిని శాలువాతో సత్కరించి, మెమంటో అందజేసి ఘనంగా అభినందించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
“చేనేత కార్మికుల హక్కుల కోసం మీ కలం, గళం మరింత బలంగా వినిపించాలని, మీడియా రంగంలోనూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని” పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల హక్కుల సాధన, రాజకీయ చైతన్యం పెంపొందించడం కోసం తన వంతు కృషిని మరింత విస్తృతం చేస్తానని ఈ సందర్భంగా రాంపెల్లి లింగమూర్తి తెలిపారు. తనను సన్మానించిన తెలంగాణ చేనేత చైతన్య సభ నిర్వాహకులు, చేనేత సంఘాల ప్రతినిధులు, కార్మికులు మరియు శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చేనేత కార్మికుల గొంతుకగా మరింత ముందుకు సాగాలని, రాంపెల్లి లింగమూర్తి గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సభ ప్రతినిధులు, చేనేత కార్మికులు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.
