తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు డయల్ 112ను సమగ్ర అత్యవసర సేవల నంబర్‌గా ప్రభుత్వం అందు బాటులోకి తీసుకువచ్చింది. ఒకే ఫోన్ కాల్‌తో మొత్తం 18 రకాల అత్యవసర సేవలను పొందే అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత..పోలీసు సహాయం, అగ్నిమాపక సేవలు, అంబులెన్స్, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, సైబర్ నేరాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే డయల్ 112 వ్యవస్థ కాలర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సంబంధిత శాఖలకు వెంటనే సమాచారం చేరవేసి స్పందన సమయాన్ని తగ్గిస్తోంది. దీంతో ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో ఈ సేవ కీలక పాత్ర పోషిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా డయల్ 112కు కాల్ చేసి సహాయం పొందాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ సమగ్ర అత్యవసర సేవలను ప్రభుత్వం మరింత విస్తృతంగా అమలు చేస్తోంది.
