తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు తాగునీరు అందడం లేదు… రోడ్లపై వృథాగా పారిపోవడానికి మాత్రం ఉందా? అంటూ కిస్మత్‌పూర్ మాజీ సర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ 122వ డివిజన్ పరిధిలో ఎర్రకుంట తండా పోచమ్మ ఆలయం సమీపంలో తాగునీటి పైప్‌లైన్ లీకై సుమారు ఇరవై రోజులుగా వేలాది లీటర్ల తాగునీరు రోడ్లపై వృథాగా పారిపోతున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన నీరుడు శేఖర్ ముదిరాజ్, ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండగా మరోవైపు విలువైన తాగునీరు వృథాగా పారిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత నీటి సరఫరా అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో వేలాది లీటర్ల నీరు రోడ్లపై వృథాగా పారిపోతున్నా అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు..ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీని శాశ్వతంగా మరమ్మతు చేయడంతో పాటు, ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, భద్రతా అవరోధాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.