తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యస్. వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల బృందం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాటేదాన్, మైలార్ దేవ్‌పల్లి డివిజన్‌ల పరిధిలోని పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే బోనాల పండుగ సందర్భంగా దేవాలయాల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, గుంతలతో నీరు నిలిచిపోయిన రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. బోనాలు ఎత్తుకుని వెళ్లే మహిళలు, పాదచారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పలు కాలనీల్లో వీధి దీపాలు నెలల తరబడి వెలగడం లేదని, పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపారు. వెంటనే వీధి దీపాలను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధి పనుల పేరుతో తవ్విన రహదారులు ప్రమాదకరంగా మారాయని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దశాబ్దాల క్రితం తక్కువ జనాభాకు అనుగుణంగా వేసిన మురుగునీటి పైపులు ప్రస్తుతం సరిపోవడం లేదని, జనాభా పెరగడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని వివరించారు. అందువల్ల ముందుగా పెద్ద సామర్థ్యం గల మురుగునీటి పైపులను ఏర్పాటు చేసి, అనంతరం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సమస్యలపై సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు, బంగారయ్య, అశోక్, శశి, వెంకటరమణ, భాస్కర్, సురేష్, మోహన్, సింహాచలం, మహేందర్, నిఖిల్, చింటూ తదితర కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.