తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, సిద్దిపేట: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలోని చేనేత కార్మికులు, చేనేత సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సిద్దిపేటలోని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్సు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుండు భూపేష్, సిద్దిపేట జిల్లా చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ ఆధ్వర్యంలో చేనేత సంఘాల అధ్యక్షులతో పాటు 20 మంది చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు విస్తృతంగా ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. దీంతో చేనేత కార్మికుల వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన గొల్లభామ చీరలకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడంలో గత ప్రభుత్వం కీలకంగా కృషి చేసిందని వారు అన్నారు. చేనేత కార్మికులకు నిరంతరం పని లభించేలా చర్యలు తీసుకుని, నెలకు సుమారు రూ.15 వేల వరకు గిట్టుబాటు కూలి వచ్చే పరిస్థితిని కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
అదేవిధంగా చేనేత సొసైటీలకు భారంగా ఉన్న క్యాష్ క్రెడిట్ బకాయిలతో పాటు చేనేత కార్మికుల రుణాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. 50 సంవత్సరాలకే చేనేత కార్మికులకు ఆసరా పథకం కింద నెలకు రూ.2,016 పెన్షన్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు.
చేనేత రంగాన్ని, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి, కార్మికులకు నిరంతర ఉపాధి, మెరుగైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కాముని రాజేశం, సిరిగది బాలరాజు, వడ్లకొండ శ్రీనివాస్, దొంతుల శ్రీధర్, సామల విట్టల్, చేర్యాల వెంకన్న, మాదాసు సత్యం, తాళ్ల విట్టల్‌తో పాటు పలువురు చేనేత కార్మికులు, చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
