తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 2023 ఆగస్టు 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ నేషనల్ అంబేద్కర్ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పంబల రాజు రాజేష్, ఎమ్మెల్యే కె. ప్రకాశ్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత కల్పించేలా డిక్లరేషన్‌లో పలు కీలక హామీలు ప్రకటించారని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ యువతకు విద్య, ఉపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని, ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. డిక్లరేషన్‌లోని మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేయాలని కోరారు.రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, హామీల అమలుకు ఎమ్మెల్యే తనవంతు కృషి చేయాలని పంబల రాజు రాజేష్ విజ్ఞప్తి చేశారు.