తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాత నగరంలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర నియోజకవర్గాల పరిధిలో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం బుద్వేల్‌లోని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా రహదారులు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫలక్‌నుమా ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆర్చ్‌లను తొలగించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరిన నేపథ్యంలో, వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రహదారులకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, ప్రతి వీధిలో వీధి దీపాలు వెలిగేలా చూడాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ నరేందర్ గౌడ్, డిప్యూటీ కమిషనర్లు పాపయ్య, సరిత, సురేందర్‌తో పాటు పాత నగర బీజేపీ నాయకులు కౌడి మహేందర్, జె. నవీన్ యాదవ్, నంద కిషోర్, ప్రభాకర్ రావు, ప్రవీణ్ యాదవ్, శ్రీనివాస్, పొన్న శ్రీనివాస్, అడికె సతీష్ తదితరులు పాల్గొన్నారు.
