తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఖమ్మం రూరల్: దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక, రాజకీయ న్యాయం దక్కడం లేదని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలోనూ బీసీలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత ప్రాతినిధ్యం పూర్తిస్థాయిలో లభించలేదని అన్నారు.

సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మ దేవాలయం ఆవరణలో నిర్వహించిన బీసీ మ్యానిఫెస్టో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్‌తో కలిసి బీసీ మ్యానిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ.. అడవుల్లో సంచరించే పులులను వాటి అడుగుజాడల ఆధారంగా లెక్కిస్తున్నారని, రహదారుల పక్కన ఉన్న మొక్కలను సైతం లెక్కిస్తున్నారని, చివరకు పశువులకు కూడా సంఖ్యను కేటాయించి చెవులకు ట్యాగ్‌లు వేస్తున్నారని అన్నారు. అయితే, సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల జనాభాను ఇప్పటివరకు కచ్చితంగా లెక్కించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

కులగణనపై ప్రత్యేక దృష్టి అవసరం: 2025 ఏప్రిల్ 1న పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ఈసారి జనగణనలో కులగణన చేపడతామని ప్రకటించారని, అనంతరం కులగణనకు సంబంధించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని డాక్టర్ అశోక్ తెలిపారు. అయితే ప్రతి ఉపకులానికి ప్రత్యేక కోడ్ నంబర్ కేటాయించడం, ఆయా కులాలను బీసీ వర్గంలో సక్రమంగా నమోదు చేయడం వంటి అంశాలపై స్పష్టత అవసరమని అన్నారు.

ప్రతి ఉపకులానికి ప్రత్యేక కోడ్ కేటాయించకుండా, కులాలన్నింటినీ బీసీ గ్రూపులో సక్రమంగా చేర్చకుండా జనగణన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రయత్నిస్తే అది బీసీలకు తీవ్ర అన్యాయం చేసే చర్యగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఈ అంశాన్ని బీసీలందరూ అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అన్యాయం జరిగితే తెలంగాణ అగ్నిగుండమే: డాక్టర్ కూరపాటి రమేష్

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ.. ఈసారి కూడా బీసీలకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పద్మశ్రీ కీర్తిశేషులు వనజీవి రామయ్య సతీమణి ధరిపెల్లి జానమ్మ, బీసీ మహిళా నాయకురాలు పద్మ, శశికుమార్, అన్నం వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy