తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాతబడిన, దెబ్బతిన్న లేదా వినియోగంలో లేని దేవతా విగ్రహాలు, దైవ చిత్రపటాలు, ఫోటో ఫ్రేములను గౌరవప్రదంగా సేకరించి పర్యావరణహిత పద్ధతిలో పునర్వినియోగం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తుల్జారాం భాగ్ ఆలయ నిర్వహణ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తుల్జారాం భాగ్ ఆలయ ప్రాంగణంలో సేకరణ కేంద్రం
తుల్జారాం భాగ్ ఆలయ ప్రాంగణంలో పాత, విరిగిపోయిన, దెబ్బతిన్న లేదా ఇకపై ఉపయోగించలేని దైవ విగ్రహాలు, ఫోటో ఫ్రేములను సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న ఇటువంటి పవిత్ర వస్తువులను రోడ్ల పక్కన, చెత్తకుప్పల్లో లేదా నీటి వనరుల్లో పడవేయకుండా ఈ సేకరణ కేంద్రానికి అందజేయాలని అధికారులు కోరుతున్నారు.
మత విశ్వాసాలకు గౌరవం.. పర్యావరణానికి రక్షణ
పవిత్రమైన విగ్రహాలు, దైవ చిత్రపటాలను చెరువులు, నదులు, కాలువలు తదితర నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్ల పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు విఘాతం కలుగుతుందని తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పాత, దెబ్బతిన్న దైవ విగ్రహాలు, చిత్రపటాలను గౌరవప్రదంగా సేకరించి, మతపరమైన పవిత్రతను కాపాడుతూ పర్యావరణహితంగా రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలి :
ప్రజలు తమ వద్ద ఉన్న పాత లేదా దెబ్బతిన్న దైవ విగ్రహాలు, ఫోటో ఫ్రేములను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా తుల్జారాం భాగ్ ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక సేకరణ కేంద్రానికి అందజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన నగరం, పర్యావరణ పరిరక్షణతో పాటు మత విశ్వాసాలకు గౌరవం కల్పించవచ్చని పేర్కొన్నారు.
