హైదరాబాద్, ఆగస్టు 22: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్‌లో చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాసులు, చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎం.వి. రావును ప్రతినిధి బృందం కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన నిధులను మంజూరు చేయడంతో పాటు, నేతన్న భరోసా పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రతినిధులు కోరారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు పెన్షన్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

చేనేత వృత్తిలో కొనసాగుతున్న 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు చేనేత సహకార సంఘంలో సభ్యత్వం ఉన్నా లేకపోయినా, జియో ట్యాగ్ ఉన్నా లేకపోయినా పెన్షన్ మంజూరు చేయాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎం.వి. రావు సానుకూలంగా స్పందించారు. సమస్య ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని, చేనేత వృత్తిలో ఉన్న అర్హులైన కార్మికులకు జియో ట్యాగ్‌తో సంబంధం లేకుండా, సహకార సంఘాల్లో సభ్యత్వం లేకపోయినా పెన్షన్ మంజూరు చేసేలా జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారుల సానుకూల స్పందనకు తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి

ఈ సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి చేనేత కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ తమ ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాల అధ్యక్షుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని మీసేవ కేంద్రాల ద్వారా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

50 సంవత్సరాలు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో, చేనేత కార్మికులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాపోలు వీర మోహన్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక సలహా మండలి చైర్మన్ చింతకింది శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy