తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం టి-శాట్ నెట్‌వర్క్ అందిస్తున్న ఉచిత డిజిటల్ కంటెంట్‌ను కల్వకుర్తి నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
యువతకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వయోపరిమితి సడలించి పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. దీనికి అనుగుణంగా టి-శాట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని, ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రసారాల వివరాలు : ఆగస్టు 24 సోమవారం నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 12 అంశాలపై నిపుణులతో ప్రత్యేక ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 600 గంటల రికార్డు చేసిన బోధనా కంటెంట్ విద్యా ఛానల్‌లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, నిపుణ ఛానల్‌లో సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ప్రసారం కానుంది. అలాగే టి-శాట్ వెబ్‌సైట్ ద్వారా ఉచిత నమూనా పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉపగ్రహ ప్రసారాలతో పాటు యూట్యూబ్, యాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ కంటెంట్‌ను వీక్షించవచ్చని పేర్కొన్నారు. కల్వకుర్తి, తలకొండపల్లి, ఆమనగల్, వెల్దండ, మాడ్గుల, కడ్తాల్ మండలాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
