తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చెందిన ఏసీ, యూసీడీ విభాగం అధికారి అనిత గ్రేస్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పథకం అమలు తీరును పరిశీలించి, అర్హులైన పేద కుటుంబాలన్నీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పేదరిక నిర్మూలన అధికారి యుగంధర్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ విజయేందర్, సంబంధిత కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.