తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గానికి పది సంవత్సరాలు శాసనసభ్యుడుగా ఉన్న కృష్ణారావు చేసిందేమీ లేకపోగా స్థాయిని మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తున్నాడని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కృష్ణారావు హయాంలో నియోజకవర్గ పరిధిలోని చెరువులు నాళాలు కుంటలు మొత్తం కబ్జా చేశారని ఆయన ధ్వజమెత్తారు. హస్మత్ పేట సర్వే నెంబర్ వన్ లో 100ఎకరాలకు పది ఎకరాలు మిగిల్చారని అల్లాపూర్ లో నాలుగు ఎకరాలకు 2ఎకరాలు, గోపాల్ నగర్లో 10ఎకరాల ఖాళీ స్థలాన్ని కబ్జాచేసి కృష్ణారావు అతని అనుచరులు సొమ్ము చేసుకున్నారని రమేష్ విమర్శించారు. పిజెఆర్ హయాం నుంచి నేటి వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై, టిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని రమేష్ సవాల్ విసిరారు. మొదటిసారి కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు నీ ఆస్తులు ఎంత, ప్రస్తుతం మీ ఆస్తుల విలువ ఎంత అంటూ ఎమ్మెల్యే కృష్ణారావును ప్రశ్నించారు. బండి రమేష్ శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. 22ఏ విషయంలో కృష్ణరావు ఉరి, హత్య,ఆత్మహత్య అంటూ ప్రజల సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నాడని అతన్ని చంపాల్సిన అవసరం మాకు లేదన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలుచేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రమేష్ కృష్ణారావును హెచ్చరించారు. హౌసింగ్ బోర్డ్ స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటుందన్న కృష్ణారావు విమర్శపై రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా అమ్ముకున్నారని అది నీకు కనిపించలేదా అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా వారికి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత విద్యుత్తు గ్యాస్ రేషన్ కార్డులు పంపిణీ పెట్రోల్ బంకులు బస్సులు ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న ప్రతి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. నగరంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫ్లైఓవర్లు అండర్పాస్ బ్రిడ్జిలు లింకు రోడ్స్ స్కై వాక్ వంతెనలు నిర్మిస్తుందన్నారు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రూ 10లక్షల బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం రాగానే 70వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, విద్యా విధానంలో నూతన వరవడిని ప్రవేశపెట్టిందన్నారు.
