తెలంగాణ ఎక్స్‌ప్రెస  న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియంలో రాగం సుజాత నాగేందర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి రాగం సుజాత యాదవ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మెగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు. వి. హనుమంతరావు, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, రాష్ట్ర యాదవ కురుమ కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం రఘునాథ్ యాదవ్ , ఉమెన్ కమిషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి త్రిపురాన వెంకటరత్నం, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ , హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ , చందానగర్ సీఐ. శ్రీధర్, పురప్రముఖులు, సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముందుగా స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, దుర్గాదేవి మాతకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి రంగురంగుల పూలతో అలంకరించిన భారీ బతుకమ్మ వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, సుమారుగా 5000మందికి పైగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో, కోలాటాలతో స్టేడియం మొత్తం పండుగ శోభను నింపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సంబరాల్లో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ , వారి సతీమణి రాగం జాగృతి సాయి యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ పాల్గొని బతుకమ్మ ఆడి విద్యార్థుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన సతీమణి గురించి మాట్లాడుతూ, మే 9, 1996నుండి దాదాపు 30ఏళ్ల పాటు నా జీవితంలో తోడుగా, ప్రజా సేవలో అండగా నిలిచిన రాగం సుజాత యాదవ్ ఇక లేరనే బాధ మాటల్లో చెప్పలేననిదని వారికి అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగను జయంతి రోజున ఇంత ఘనంగా నిర్వహించడం వారి ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని తన కోరిక మేరకు నా మిగిలిన జీవితం ప్రజా సేవకే అంకితం చేస్తానని భావోద్వేగంగా అన్నారు. అనంతరం, బతుకమ్మ సంబరాల్లో చురుకుగా పాల్గొన్న పాఠశాల విద్యార్థినులకు రాగం సుజాత యాదవ్ జయంతి సందర్భంగా మెమెంటోలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను విచ్చేసిన ముఖ్య అతిథుల చేతులమీదుగా ప్రధానం చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విద్యార్థులతో కలిసి బతుకమ్మ డీజే స్టెప్పులు వేసి సందడి చేశారు. అనంతరం, మాట్లాడుతూ, సుమారు 5000మందికి పైగా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, కనీ వినీ ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించిన రాగం నాగేందర్ యాదవ్ ను కొనియాడుతూ ఈ మెగా బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శేరిలింగంపల్లి మండల రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.ఆర్. పవన్ కుమార్ వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా అసోసియేషన్ అభివృద్ధి కోసం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రూ.1,00,000లక్ష రూపాయల చెక్కును అసోసియేషన్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని యువ నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ స్పాన్సర్ చేయగా ఎల్ ఎన్ ఏఆర్ కుమార్ ఆధ్వర్యంలోని శేరిలింగంపల్లి మండల రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు నిర్వహించారు.

You missed