తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ 127వ వార్డు, నెక్నాంపూర్ 128వ వార్డు పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అధ్వాన్నమైన రహదారులు, సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కొరతపై నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత స్థానిక సంస్థల పాలనలో జరిగిన వైఫల్యాలు, అస్తవ్యస్త పట్టణ ప్రణాళిక, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరగాలని సీతారాం ధూళిపాళ డిమాండ్ చేశారు.
రెండు కాలనీలు.. భూముల కేటాయింపులపై ప్రశ్నలు
అక్రమ నిర్మాణాలపై నిష్పక్షపాత విచారణ జరపాలి :
రాజకీయ పలుకుబడితో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారా? ప్రభుత్వ భూములు, పార్కులు, బహిరంగ స్థలాలు, సదుపాయాల కోసం కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని సీతారాం ధూళిపాళ అన్నారు.
చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ హోదా ఉన్నంత మాత్రాన ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే, ఆక్రమణలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారికంగా నిర్ధారణ అయినప్పుడే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రచారం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారమే నిజమైన సేవ :
సామాజిక సేవ పేరుతో ప్రచారం చేసుకోవడం కంటే ప్రజా ఆస్తులను కాపాడటం, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నివాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూముల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించడం, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనలో నాయకులు తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
బహిరంగ స్థలాలు, సదుపాయాల భూములపై పారదర్శక భూ ఆడిట్ నిర్వహించాలి. భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల ఆరోపణలపై నిష్పక్షపాతవిచారణ జరపాలి. ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాల భూములను పరిరక్షించి, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. రహదారులు, ట్రాఫిక్, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. లేఅవుట్ అనుమతులు, భూముల కేటాయింపులు, ప్రస్తుత స్థితిగతులను ప్రజలకు వెల్లడించాలి. గత పరిపాలనలో జరిగిన లోపాలను సమీక్షించి, బాధ్యతలను నిర్ధారించి, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలి.
మేలుకోండి నివాసులారా.. మీ హక్కుల కోసం ప్రశ్నించండి!
రాజకీయాలు, వ్యక్తిగత ప్రచారాలకు అతీతంగా ప్రజలు తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని సీతారాం ధూళిపాళ పిలుపునిచ్చారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, అధికారుల జవాబుదారీతనం కోసం నివాసులంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. మన భూములు మన ఆస్తులు.. మన మౌలిక సదుపాయాలు మన హక్కులు.. ప్రజా ఆస్తుల పరిరక్షణ మన బాధ్యత.. జవాబుదారీతనమే మన డిమాండ్! అన్నారు.
