తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఎంత ముఖ్యమో, దేవుడి చిత్రాలకు గౌరవం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని సామాజికవేత్త మాడూరి గోపి గుప్తా అన్నారు. పెళ్లి పత్రికలు, విజిటింగ్ కార్డులు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి చిత్రాలను ముద్రించడం వల్ల, ఆయా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వాటిని కొందరు చెత్తకుప్పల్లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ సంప్రదాయంలో దేవతా చిత్రాలకు విశేషమైన ప్రాధాన్యత ఉందని, అలాంటి చిత్రాలు చెత్తకుప్పల్లో కనిపించడం బాధాకరమని పేర్కొన్నారు. పెళ్లి పత్రికలపై దేవుడి చిత్రాలను ముద్రించి బంధువులకు, మిత్రులకు పంపిణీ చేస్తున్నప్పటికీ, వాటిని భద్రపరచకుండా పారవేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితిని నివారించేందుకు పెళ్లి పత్రికలు, విజిటింగ్ కార్డులు, ఇతర ముద్రిత పత్రాలపై దేవుడి చిత్రాలకు బదులుగా దేవతల పేర్లను మాత్రమే ముద్రించే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల దేవతా చిత్రాలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో పడకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు.భక్తి అనేది పూజలకే పరిమితం కాకూడదు.. మనం పూజించే దేవతా చిత్రాలకు గౌరవం ఇచ్చే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ విషయంపై ప్రజలు ఆలోచించి, ఆచరణలో మార్పు తీసుకురావాలని మాడూరి గోపి గుప్తా విజ్ఞప్తి చేశారు.

You missed