గోపాల్‌పూర్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో అక్టోబర్ 25న తెలంగాణ చేనేత ఐక్య వేదిక మండల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి చిదురాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన శ్రీ శివలింగ మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ హాజరై మాట్లాడారు.

సమావేశంలో ఎల్కతుర్తి మండల నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన గుర్రపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేముల శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామాల్లో పద్మశాలీల వివరాలు సేకరించి, అర్హులైన చేనేత కార్మికులకు పహచాన్ కార్డులు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. జియో ట్యాగ్ నంబర్లు లేని చేనేత కార్మికుల జాబితాను సిద్ధం చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా తెలంగాణ చేనేత ఐక్య వేదిక కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో భారీ స్థాయిలో ఆత్మీయ మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సూరారం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వేముల సమ్మయ్య, గ్రామ మాజీ ఉపసర్పంచ్ రాజమౌళి, దేవాలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల పద్మశాలి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాపోలు వీరమోహన్‌ను ఘనంగా సన్మానించారు.