తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ. 3.3కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 11అదనపు తరగతి గదుల నిర్మాణపనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రారెడ్డి , పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. సమగ్ర శిక్షా పథకం ద్వారా మంజూరైన రూ.3.3కోట్ల నిధులతో నిర్మించబోయే అదనపు తరగతి గదుల వల్ల పాఠశాలలో విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కలుగుతాయని రద్దీ తగ్గి ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని తెలిపారు. నిర్మాణపనులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని విద్యాభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కార్పొరేటర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, పీ.డీ టీచర్ కేశవ రెడ్డి, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.