• రవీంద్ర భారతిలో నల్లా నర్సింహులు 33వ వర్ధంతి సభ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో జరిగిన మహత్తర పోరాట చరిత్రను భావితరాలకు, ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 5) సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు 33వ వర్ధంతి సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కేవలం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం మాత్రమే కాదని, వెట్టిచాకిరీ విధానం, సామాజిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన మహత్తర ప్రజా పోరాటమని టి. చిరంజీవులు పేర్కొన్నారు.

గొప్ప పోరాటాలు నిర్వహించి సమాజానికి సేవలందించిన యోధులను కేవలం ఆయా కులాలకు మాత్రమే పరిమితం చేయడం సరైన పద్ధతి కాదని సీపీఐ అగ్రనాయకులు కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ పోరాట వీరుల చరిత్రను సమాజం మొత్తం గౌరవించాలని, వారి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు.

ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, నల్లా నర్సింహులు కుమార్తె చింతకింది అరుణ, తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వనం శాంతికుమార్ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో కడవెండి, పాలకుర్తి గ్రామాలకు చెందిన పలువురు నల్లా నర్సింహులు అభిమానులు, సానుభూతిపరులు పాల్గొని సభను విజయవంతం చేశారు.
