చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక చేయూతపై చర్చ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్, గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్‌తో కలిసి నవంబర్ 5న హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్‌లో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడము వెంకట రమణలను ప్రత్యేకంగా కలిశారు.

ఈ సందర్భంగా చేనేత రంగం అభివృద్ధి, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పద్మశాలి సమాజ సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు సంబంధించిన క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలని, తద్వారా సహకార సంఘాలకు ఆర్థిక భారం తగ్గించి నేతన్నలకు అండగా నిలవాలని కోరారు.

అలాగే పద్మశాలి కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, వారి జీవనోపాధికి తోడ్పాటు కల్పించాలని చైర్మన్ గూడూరు శ్రీనివాస్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్ ఇరువురు కార్పొరేషన్ చైర్మన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. చేనేత రంగం అభివృద్ధికి, పద్మశాలి సమాజ సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ భేటీలో ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Avatar photo

By Murthy